అర్ధం కాని మాట.. హేతువాదం
నా చిన్నప్పుడు.. నాన్నతో పాటు.. ఓ వ్యక్తి ఇంటికి వచ్చాడు..తెల్లలూజు చొక్క.. మామూలు ప్యాంటు వేసుకుని ఉన్నాడు.. అప్పుడు నాకు సరిగా ఊహ తెలియదు... అప్పటికే పలుమార్లు మా ఇంటికి వచ్చినట్టు చెప్పారు.. చిన్నతనంలో ఆయన రాగానే.. చేయి చాపేవాడిని.. అందులో ఆయన వక్కపొలుకుల మధ్య ఉండే వేయించిన గుమ్మడి గింజను ఇచ్చేవాడు... సరదాగా నములుతూ వెళ్లిపోయేవాడిని .. ఆసమయంలో.. నాన్నకి.. ఆయనకి మధ్య ఎన్నో విషయాలు ప్రస్తావనకు వచ్చేవి.. అవి అప్పట్లో నాకు సరిగా అర్ధం అయ్యేవి కావు.. కానీ.. ఆయన రాగానే.. పప్పులు కావాలని మాత్రం అడిగే వాడ్ని.. క్రమంగా అదే పేరును ఆయనకు స్థిరం చేసేసా.. అదే పప్పు మామా.. అని..
పప్పు మామ.. మా ఇంటికి వచ్చినప్పుడల్లా క్రేన్ వక్కపొడి వేసుకునే వాడు.. దాన్లొ నుంచి నాకు కూడా రెండు పొలుకులు ఇచ్చేవాడు.. ఆయన రాగానే చేతులు చాచేంతగా నాకు అలవాటైంది.. వక్కపొలుకులు తినడం.. అమ్మ తిడుతున్నా... పప్పు మామా మాత్రం ఫర్వాలేదులేండి..లక్ష్మిగారు.. అంటూ.. వక్కపొలుకులు పెట్టేవాడు..
అమ్మ ఇంటిలో ఎప్పుడైనా పూజ చేసేది.. కానీ స్నేహితుల ఇళ్లలో మాత్రం పూజలు పెద్ద కార్యక్రమంలా జరిగేవి.. వీటి విషయంలో ఎప్పుడూ నాకు సందేహమే.. కానీ ఈ సందేహానికి సమాధానం అప్పుడు దొరకలేదు.. కానీ తర్వాత కాలంలో.. నాకు అర్ధం అయింది.. హేతువాదం.. అని...
నా స్నేహితులతో హేతువాదం అంటే.. వాళ్లు దేవుడిని నమ్మరు.. వారితో మాట్లాడకూడదు.. అనేవారు.. విషయం కాస్త వితండంగా ఉండేది.. నాన్న దగ్గర కూర్చుని కొన్ని విషయాలు చెప్పినా.. అవి పెద్ద విషయాలై... కాస్త సందిగ్ధత ఉండేది.. కానీ ... పప్పు మామని ఈ విషయాలను గురించి.. అడిగితే...
నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన చాలా విషయాలు చెప్పేవారు.. ఎంత సున్నితంగా అంటే.. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టేంతగా... అప్పట్లోనే అమ్మను మమ్మి అని పిలిచే అలవాటు ఉండేది.. కానీ ఈజిప్ట్ ల సమాధులను మమ్మీలు అని పిలుస్తారు.. అన్న తర్వాతే.. అమ్మను అమ్మా అని పిలవడం అలవాటు చేసుకున్నాను..
చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉండేది.. నాన్న నుంచి వచ్చిన అలవాటు...అది.. ఇప్పుడంటే ఫోన్లు వచ్చి టైంను తినేస్తున్నాయి కానీ.. అప్పట్లో పుస్తకాలను బాగా చదివేవాడిని.. ముఖ్యంగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేసేవాడిని...
అప్పట్లో ఆయన... విప్లవం, రాజకీయం, హేతువాదం, నాస్తికత్వం.. అనే పదాలు వాడితే అవి అసలు అర్ధం అయ్యేవి కావు.. ఇప్పటికీ అవి పూర్తిగా అర్ధం అయ్యాయని కాదు..
హేతువాదం.. అంటే దేవుడు లేడనే తత్త్వం కాదు.. ఉంటే చూపమనే ప్రశ్న... అస్తిత్వం లేని వస్తువు లేదా.. ప్రాణానికి ప్రణామాలు చేయడం వృధా.. అనే సమాధానం..
ప్రతి ఘటనకు.. విషయానికి హేతువు ఉంటుంది... ఆ హేతువు సహేతుకంగానే ఉంటుందనేది... హేతువాద విధానం..
కొన్ని కట్టుబాట్లు.. కొందరి విచక్షణ.. మరికొందరి ఆకాంక్ష వెరసి మత తత్వాలు వచ్చాయి.. మతం ఏదైనా.. దాని అభిమతం స్వార్థమని స్పష్టం చేసేవారు.. హేతువాదులు.. మతం... లేని నాడు.. తోటి మనిషిని మనిషిగా చూస్తారు జనం.. దీంతో కుహనా గౌరవాలు మంటకలిసిపోతాయి.. అందుకే మతం .. కొందరు స్వార్థపరుల చేతిలో పనిముట్టు...
నీళ్లు వేడి చేస్తే.. కాలుతాయి అనేది వాస్తవం... ఎన్నిసార్లు ప్రయోగించినా.. ఎవరు ప్రయోగించినా.. అదే ఫలితం వస్తుంది.. ఒక స్థానాన్ని చూపి.. దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేది నమ్మకం.. ఈ నమ్మకం ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా ఉంటుంది.. నమ్మకాన్ని.. నిజాన్ని ఒకే గాటన కట్టకూడదనే వివరణే హేతువాదం..
సైన్స్ చెప్పేది.. వాస్తవం.. మతం చెప్పేది విశ్వాసం..
నమ్మకాన్ని.. నిజాన్ని వేరు చేసి చూడలేనంతకాలం.. ఈ సమాజంలో... దేవుళ్ల పేరుతో జాతరలు జరుగుతూనే ఉంటాయి.. బలులు సాగుతూనే ఉంటాయి.. ఆహారం కోసం పశువుల ప్రాణం తీయడం అవసరం..... దేవుళ్ల పేరు చెప్పి పశువులను చంపడాన్ని ఏమనాలి...ఇలా ఎన్నో సమాధానాలను ఆయన సున్నితంగా సునిశితంగా తెలియజేసేవాడు..
ఎప్పుడు ఒకే రకమైన దుస్తులు వేసుకునేవాడు.. సండేమార్కెట్ లో ఓ మూల ఓ షాపు ఉండేది.. దాని పేరు మణి బుక్ స్టాల్... ఒకసారి అక్కడికి వెళ్లినప్పుడు నాన్న చెప్పాడు.. అది పప్పుమామది.. అని...అప్పటి వరకు ఆయన పేరు టీపీ మణి అని తెలియనంత అమాయకత్వం నాది.. తర్వాత కాలంలో ఎన్నో విషయాలు చెప్పేవారు.. పుస్తకాలను ఎలా అర్ధం చేసుకోవాలో సూచించేవారు.. అక్షరాల్లో దాక్కొన్న అసలు సత్యాలను వెతకాలని బోధించేవారు.. హేతువుని అర్ధం చేసుకుని.. ప్రతి పనిని చేయాలని.. అప్పుడే.. జీవితంలోని మధురత్వం తెలుస్తుంది.. అనే వారు..
నాకు తెలిసిన.. హేతువాదులు..నాస్తిక వాదులు.. మానవ వాదుల్లో... మా నాన్న జొన్నలగడ్డ మార్కండేయులు ప్రథములైతే... రెండవ వ్యక్తి టీపీ మణి మామ...
వారిద్దరి ప్రభావం నా మీద బాగా ఉంది.. దీనికి తోడు.. నా సమకాలీన సమాజంలో నేను చూసిన దేవుళ్లు.. నేను చదివిన కథలు.. కూడా నా మీద పనిచేశాయి... అందుకే అంతరంగంలో నేనేంటో నాకు కాస్తంత మాత్రమే తెలుసు... కానీ బయట ప్రపంచానికి నేనేమిటో...
అక్షరాలను అర్ధం చేసుకునే క్రమంలో నాతో ఉన్న వారు.. ఇప్పుడు నాకు తోడు లేకపోయినా...నా అక్షరాలకు దిశానిర్ధేశం చేసుకునే అవకాశాన్ని..ఎంచుకునే సామర్ధ్యాన్ని నాకు నేర్పారు వారు...అందుకే అక్షరాలనే వృత్తిగా మార్చుకుని జర్నలిజంలో కొనసాగుతున్నాను...
Superb sir
ReplyDelete👌👌👌
Delete